- చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట
- ఒక్కరోజే దాదాపు రూ.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం
- పలు రోడ్లకు శంకుస్థాపనలు.. పలు ప్రభుత్వ కార్యాలయాలు, కేజీబీవీ, రైతుబజార్ తదితర నూతన భవనాల ప్రారంభోత్సవాలు
- అనకాపల్లి జిల్లాలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. రూ.2,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బృహత్తర కార్యక్రమం
- ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువ చేసి చూపించి మీ ముందుకు రావడం నిజంగా గర్వంగా ఉంది
- స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం
- అనకాపల్లి జిల్లాలో రూ.4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు, అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు గర్వంగా ఉంది.
- పోలవరం జలాలతో ఉత్తరాంధ్రకు మరింత అభివృద్ధి.. పరిశ్రమలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
- మూడు నెలలకు ఒకసారి అయోధ్య–కాశీ దివ్య దర్శన యాత్ర.. ఇప్పటికే 1,600 మందికి పైగా భక్తులకు అవకాశం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి
- గాజువాకలో చెల్లని రూపాయి చోడవరంలో చెల్లుతుందా?.. గుడివాడ అమర్‌నాథ్‌పై వ్యాఖ్య
చోడవరం,సెప్టెంబర్ 16(నిఘా ప్రతినిధి): చోడవరం నియోజకవర్గ పరిధిలో సుడిగాలి పర్యటన ఒక్క రోజులోనే ఇరవై కార్యక్రమలల్లో ఎమ్మెల్యే రాజు టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు లతో కలసి పాల్గొన్న రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ చోచోడవరంనియోజకవర్గ పర్యటనలో భాగంగా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కె.ఎస్.ఎం.ఎస్. రాజు, టీడీపీ జిల్లా ఇన్‌చార్జి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాలయ్య తదితరులతో కలిసి వివిధ గ్రామాల్లో రోడ్డు పనులకు శంకుస్థాపనలు, పలు నూతన భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఒక్కరోజే చోడవరం నియోజకవర్గంలో దాదాపు రూ.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సీఎం రమేష్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని, అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు.
20 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
పర్యటనలో భాగంగా నిందుగొండ–బుచ్చంపేట రహదారి నుంచి రాజుపేటకు బీటీ రోడ్డు, గుర్రంపేటకు బీటీ రోడ్డు, బీఎన్ రోడ్డు నుంచి సరభవరం వరకు రోడ్డు మరమ్మతులు, రోలుగుంటలో కేజీబీవీ నూతన భవనాల ప్రారంభం, కొత్తకోటలో బీటీ రోడ్డు మరమ్మతులు, కనాడకు బీటీ రోడ్డు, గార్నికంలో కేజీబీవీ భవనాల ప్రారంభం, రావికమతం–నాగన్నపాలెం బీటీ రోడ్డు, రావికమతంలో మండల పరిషత్ భవన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
అనంతరం గుడ్డిపలో బీఎన్ రోడ్డు నుంచి రోడ్డు మరమ్మతులు, రాజుపాలెంకు బీటీ రోడ్డు, తురకలాపూడి–రాజాం రోడ్డు మరమ్మతులు, గున్నెంపూడి–ఆర్‌ఈసీ రోడ్డు, పోలేపల్లి–ఆర్‌ఈసీ రోడ్డు మరమ్మతులు, వడ్డాదిలో కేజీబీవీ భవన ప్రారంభం, పి.ఎస్.పేట వద్ద తిమ్మన్నపాలెం–చోడవరం రోడ్డు మరమ్మతులు, చోడవరంలో రైతుబజార్, తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం,అంబేరుపురం–రాయపురాజుపేట రోడ్డు మరమ్మతులు, గంధవరం ఏపీ సీడ్స్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ.. “ఎన్నికల సమయంలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని చెప్పాం. ఈరోజు వాటికంటే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టి మీ ముందుకు వచ్చి మాట్లాడటం నిజంగా గర్వంగా ఉంది” అని అన్నారు.
రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
స్థానిక యువతకు తొలి ప్రాధాన్యత
అనకాపల్లి జిల్లాలో భారీ స్థాయిలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో స్థానిక యువతకు తొలి ప్రాధాన్యతతో ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే మా ప్రధాన లక్ష్యం. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో జిల్లాకు అపారమైన అవకాశాలు ఉన్నాయి అని అన్నారు.
అనకాపల్లి జిల్లాలో దాదాపు రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, పార్లమెంట్‌లో అనకాపల్లి అభివృద్ధి గురించి ప్రస్తావనలు వచ్చినప్పుడు ఎంపీగా తనకు ఎంతో గర్వంగా ఉంటుందని అన్నారు.
అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన, ఉక్కు తదితర రంగాల్లో పెద్ద పెట్టుబడుల వచ్చి పనులు ప్రారంభం అయ్యాయి అన్నారు.ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనకాపల్లి జిల్లాలో రూ.2,000 కోట్లతో ప్రతి ఇంటికీ సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
కేంద్ర జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరా లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతోంది అన్నారు.
గ్రామాల్లో దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వ, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ సహకారంతో దాదాపు రూ.40 లక్షల వరకు నిధులు అందేలా కృషి చేస్తామని సీఎం రమేష్ తెలిపారు.
చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎం.ఎస్. రాజుతో సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రమేష్ అన్నారు.“ఎమ్మెల్యే రాజు గారు ఎప్పుడు కలిసినా నియోజకవర్గ అభివృద్ధి, ఏదో ఒక పని గురించి మాట్లాడుతుంటారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయనతో కలిసి చోడవరం నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం” అని అన్నారు.
పర్యటించిన ప్రతి గ్రామంలో మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలు, పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.
పలువురు గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలు అందజేసి రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.“గ్రామాల్లో ప్రజలు అడిగిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మా వంతు పూర్తి సహకారం అందిస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా బాధ్యత” అని భరోసా ఇచ్చారు.
అయోధ్య–కాశీ దివ్య దర్శన యాత్ర కొనసాగింపు
అయోధ్య–కాశీ దివ్య దర్శన యాత్ర గురించి మాట్లాడుతూ ఇప్పటికే 1,600 మందికి పైగా భక్తులను అయోధ్య, కాశీ దివ్య దర్శనానికి తీసుకెళ్లామని తెలిపారు.
రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి యాత్ర నిర్వహించే విధంగా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలనే ఉద్దేశం ఉందన్నారు. ఇందులో సుమారు 80 శాతం మంది మహిళలకు అవకాశం కల్పించేలా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పోలవరం జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు
పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించే ప్రక్రియ గురించి ప్రస్తావించారు. ఇటీవల పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసినట్లు, ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 9 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రణాళిక ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నరు.“పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్రకు గోదావరి జలాల రాక, అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి గురించి స్థానిక నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలి” అని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.“గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని అన్నారు.“స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి” అని వ్యాఖ్యానించారు.స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గాజువాకలో ఘోరంగా ఓటమి పాలైన గుడివాడ అమర్‌నాథ్ ఇప్పుడు కొత్తగా చోడవరానికి రావడం చూస్తున్నాం. గాజువాకలో చెల్లని రూపాయి చోడవరంలో చెల్లుతుందా?” అని అమర్‌నాథ్‌ను ఉద్దేశిస్తూ విమర్శిస్తూ “అటు అనకాపల్లిలో, ఇటు గాజువాకలో పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చోడవరానికి రావడం అందరం చూస్తున్నాం. అక్కడ చెల్లని రూపాయిని ఇక్కడ మార్చుకోవాలని చూస్తున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు.ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని, ప్రజల విశ్వాసం పొందేందుకు అభివృద్ధి, ప్రజాసేవే ప్రధాన ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నారు.ప్రజల సహకారంతో చోడవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.