కాకినాడ సమగ్ర అభివృద్ధికి భారీ ప్రాజెక్టులు:మంత్రి పి.నారాయణ
రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి,జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ
కాకినాడ, సెప్టెంబర్ 13(నిఘా ప్రతినిధి):
కాకినాడ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు భారీ ప్రాజెక్టులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు.ఆదివారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక అభివృద్ధి, ప్రాజెక్టుల పైనిర్వహించినసమావేశానికి రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ, జిల్లా కలెక్టర్ ఎం. ఎన్ .హరేంధిర ప్రసాద్,కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు,పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో తాగునీరు,రహదారులు, పారిశుధ్యం,గ్రీనరీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి తెలిపారు.కాకినాడలో రూ.354 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, నీటి కేటాయింపులకు సంబంధించిన జీవో త్వరలో వెలువడనున్నందున పనులను మరింత వేగవంతం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా పరిసర మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి సేకరించే ఘన వ్యర్థాలను శుద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ప్లాంట్‌కు అవసరమైన నీటి సరఫరా సమస్యను కూడా త్వరగా పరిష్కరిస్తా మన్నారు.నగర పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎండ్ టు ఎండ్ రోడ్లుఅవసరమని పేర్కొన్న మంత్రి,రహదారుల అభివృద్ధికి రూ.39 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బ్యాలెన్స్ రోడ్లతో పాటు కచ్చా, గ్రావెల్ రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో సెంట్రల్ డివైడర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్వీపింగ్ యంత్రాలు సమర్థంగా పనిచేసేందుకురహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో గ్రీన్ ఏరియాను 50 శాతానికి పెంచాలన్న లక్ష్యానికి అనుగుణంగా కాకినాడలో పార్కులు, గ్రీనరీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే టెండర్లు పిలిచామని,త్వరలో ఖరారు చేసి ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నగర పారిశుధ్య సమస్యల కు శాశ్వత పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థే నని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు బహి రంగ డ్రైన్లలోకి చేరకుండా భూగర్భ పైపుల ద్వారా తరలించేలా యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
కాకినాడలో యూజీడీ ప్రాజెక్టు కు రూ.200–250 కోట్ల వరకు నిధులు సమ కూర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, యూఐడీఎఫ్-3, యూఐడీఎఫ్-4 తదితర పథకాల ద్వారా నిధుల సమీకరణకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కన్సల్టెంట్‌ను నియమించి ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
అభివృద్ధి పనులకు ప్రాధాన్యం:
సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ.. కాకినాడ నగరంలో ఇప్పటికే మంజూరైన నిధులు, చేపట్టిన పనులు, పెండింగ్ ప్రతిపాదనలు,భవిష్యత్ అవసరాలపై సమగ్రంగా సమీక్షిస్తున్నామన్నారు. పారిశుధ్య వ్యవస్థను మరింత మెరుగు పరచడం తో పాటు అవసరమైన చోట్ల రహదారుల నిర్మాణం, డ్రైనేజీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలనిఅధికారులకు సూచించినట్లు చెప్పారు. నగరంలో మురుగునీరు శుద్ధి చేయకుండా సముద్రం లోకి చేరకుండా ఎస్టీపీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతం లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన పనులతో పాటు ఇంకా పూర్తి చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు,ఎస్ఈ పి.వెంకటరావు,హెల్త్ ఆఫీసర్ డా. పృద్వి చరణ్, ఈఈలు మాచిరాజు, కనకారావు, మెప్మా పీడీ శైలజ, టౌన్ ప్రాజెక్ట్ మేనేజర్ డి.వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.