- బుడమేరు విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దు: ఎమ్మెల్యే బోండా ఉమా
- వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది
- 10 వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించాం
- అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాం: ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
సింగ్‌నగర్, సెప్టెంబరు 25 (నిఘా ప్రతినిధి):గురువారం బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇప్పటివరకు సుమారు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించామని, మరింత వరద నీరు వచ్చినా సురక్షితంగా మళ్లించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
2024లో ఎదురైన వరద ముంపు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందన్నారు. వర్షపు నీరు బుడమేరు వైపు వచ్చినా దానిని కృష్ణానదిలోకి మళ్లించేలా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు.
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా తొలగించేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఈలు, ఏఈలు, సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం, సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, సుందరయ్యనగర్, వడ్ల కాలనీ, రాజీవ్‌నగర్, కండ్రిక తదితర ప్రాంతాల ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని బోండా ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం, అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.