•అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
•53 ఎంపీటీసీ, 04 జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
విశాఖపట్నం, అక్టోబర్ 19(నిఘా ప్రతినిధి): విశాఖపట్నం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 19న వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 23 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అని, 24న పరిశీలన ఉంటుందని చెప్పారు. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని వివరించారు. నవంబర్ 7న పరోక్ష ఎన్నికల నోటీసు, 11న పరోక్ష ఎన్నికల ప్రత్యేక సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని, జడ్పీ సీఈవో అదనపు ఎన్నికల అథారిటీగా ఉంటారని తెలిపారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 16 జోన్లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 203 పోలింగ్ కేంద్రాలను సుమారు 106 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 1,462 మంది సిబ్బందిని నియమించామని, పోలింగ్ సామగ్రి తరలింపు కోసం 25 రూట్లను గుర్తించామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు నాలుగు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, రెండు వీడియో వీక్షణ బృందాలు, ఐదు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు, ఐదు సింగిల్ విండో క్లియరెన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల వ్యయ పరిమితి ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొంటూ అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నామినేషన్లు ఎక్కడ స్వీకరిస్తారు.
పరిషత్ ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ అభ్యర్థులు జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో ఛాంబర్లో, ఎంపీటీసీ అభ్యర్థులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లోని ఆర్వో ఛాంబర్లలో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఆయా ఆర్వోలను నియమించినట్లు పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల ప్రక్రియకు, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.